ద్వేషానికిక తావు లేదు.. ఈ దేశంలో సదా ప్రేమే జయిస్తుంది.. ఇండియాలో సరికొత్త ఆశాకిరణాలు ఉదయిస్తాయి’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన భారత్ జోడో పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఆదివారం సాయంత్రం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ .. ఈ దేశానికి నేనిచ్చిన హామీ నెరవేర్చాను అని పేర్కొన్నారు. 75 ఏళ్ళ క్రితం 1948 లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాల్ చౌక్ లో మొదటిసారి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఆనాడు ఆయనతో చేతులు కలిపారు. ఇక దేశాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ రాహుల్ గాంధీ సెప్టెంబరు 7 న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. దేశంలోని 75 జిల్లాలల్లో సుమారు 4,080 కి.మీ. దూరం ఈ యాత్ర సాగి.. జనవరి 29 న జమ్మూ కశ్మీర్ లో ముగిసింది.
నిన్న చివరి సారి కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ..జోడో యాత్రలో ఆయనను కలుసుకున్నారు. గుల్జార్ అనే మహిళ అస్వస్థతతో ఉన్నప్పటికీ తన పదేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాహుల్ గాంధీని కలుసుకుంది. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాహుల్ గాంధీ ఎంతో శ్రమకోరుస్తున్నారని ఆమె ప్రశంసించింది.
ఈ నెల 30 న రాహుల్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసి ఉందని, కానీ అధికారులు అనుమతించడం లేదని పార్టీ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. జోడో యాత్ర ముగుస్తున్న సందర్భంగా ఆదివారం నాడే పతాకాన్ని ఎగురవేసేందుకు వారు అనుమతించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం రాహుల్ శ్రీనగర్ లోని పంథా చౌక్ నుంచి యాత్రను ప్రారంభించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. సోమవారం జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ 11 పార్టీలను ఆహ్వానించింది. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ-యు, ఉధ్ధవ్ థాక్రే శివసేన వర్గం, సీపీఐ ఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఈ బహిరంగ సభలో పాల్గొననున్నాయి.