ప్రముఖ సింగర్ వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణీ జయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. బేసంట్ నగర్ స్శశాన వాటికలో వానీ జయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాణీ జయరాంను చివరిసారిగా చూసేందుకు అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు.
అంతకుముందు వాణీ జయరాం నివాసానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. వాణీ జయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది.
దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె తుదిశ్వాస విడిచారని అన్నారు. కాగా శనివారం చెన్నైలోని తన నివాసంలో వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాం మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు.
ప్రముఖ గాయనీగా పేరు సంపాదించుకున్న వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. నవంబర్ 30న 1945లో తమిళనాడులోని వెళ్లూరులో వాణీ జన్మించారు. దురైస్వామి అయ్యాంగర్, పద్మావతి దంపతులకు మొత్తంగా ఆరుగురు కాగా అందులో ఐదో సంతానంగా వాణీ జయరాం జన్మించారు. వాణీ జయరాం తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు.