ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ పోలీసుల కళ్ళు గప్పి పంజాబ్ నుంచి పరారై ఒకదాని వెనుక ఓ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాడు. ఇతని కదలికలు సీసీటీవీ ఫుటేజీలో చూస్తున్న పోలీసులకు ఇతడిని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. తాజాగా హర్యానాలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాలో గొడుగు వేసుకుని నడిచివెళ్తున్న ఇతగాని వైనం బయటపడింది. పైగా తననెవరూ గుర్తు పట్టకుండా ప్యాంటు, షర్టు ధరించి వెళ్తూ కనబడ్డాడు.
ఈ నెల 20 నాటి ఈ సీసీటీవీ ఫుటేజీ నిన్న పోలీసుల కంటబడింది. ఈ నెల 18 న జలంధర్ జిల్లాలో మోటార్ సైకిల్ పై పారిపోతున్న అమృత్ పాల్ సింగ్..ఆ మరునాడు హర్యానా చేరుకున్నాడట . కురుక్షేత్రలో నివసించే బల్జీత్ కౌర్ అనే మహిళ ఆ రాత్రి ఇతనికి, ఇతని సహచరునికి ఆశ్రయం కల్పించింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
అమృత్ పాల్ తన సహచరునితో బాటు సెహోవాల్ అనే గ్రామంలో ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి సమీపంలోని నదిని దాటాలనుకుని కూడా ఆ యోచన విరమించుకుని ఆటో ఎక్కారట. ఆటోలో కురుక్షేత్రలో ప్రవేశించారు.
ఒక దశలో బోటు కోసం వేచి చూశాడని, తరువాత స్థానిక రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నాడని కూడా తెలుస్తోంది. బల్జీత్ కౌర్ ఇంటి నుంచి ఇతగాడు ఎవరికో ఫోన్లు చేశాడని, ఉత్తరాఖండ్ వెళ్లిపోవాలని ప్లాన్ చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇతని స్నేహితుడైన పాపాల్ ప్రీత్ .. ఇతనికి వెన్నుదన్నుగా ఉంటున్నాడు. నిన్న మహారాష్ట్ర లో ఉండవచ్చునని భావించిన ఆ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ పోలీసులను పంజాబ్ పోలీసులు అలర్ట్ చేశారు. రకరకాలుగా వేషాలు మారుస్తూ ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు ఏడో రోజుకు చేరుకుంది.