డ్యూటీకి వెళ్లివచ్చి హాయిగా నిద్రపోదామంటే..అర్థరాత్రి కంపెనీ నుంచి మెయిల్స్ వస్తాయి. ఉద్యోగం నుంచి తొలగించాం..మీ సేవలు ఇక చాలు అని అందులో ఉంటుంది. ఇది ఐటీ రంగం దుస్థితి. అందులో పని చేస్తున్న ఎంప్లాయిస్ ఉద్యోగాలు ఎప్పుడు ఏ క్షణంలో ఊడుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అసలు ఐటీ రంగానికి ఏమైంది..ఐటీ రంగంలో సంక్షోభం లక్షలాది మందిని రోడ్డున పడేస్తోంది.
ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మెటా, ట్విట్టర్,మైక్రో సాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలు లే ఆఫ్స్ తో పాటు, రిక్రూట్ మెంట్లు కూడా నిలిపివేశాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. ఆర్థిక మాంద్యం సాధారణంగా 3, 4 ఏళ్లు కొనసాగుతుంది.
దీంతో ఓ దేశ జీడీపీ 10 శాతం కుంగుబాటుకు లోనవుతుంది. మాంద్యం నిరుద్యోగం, పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ప్రాంతానికో, ఒక నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండటం ఖాయం. ఈ లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల భారాన్ని,కంపెనీల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి.
ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆఖరికి ప్రపంచం తలకిందులైనా తమ ఉద్యోగాలకు ఢోకా లేదని భావించే గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించడం, జీతాలను తగ్గించటం… పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది.అయితే ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థిక వేత్తలు ఇప్పటికే అంచనా వేశారు.