సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. పొగ అలుముకుంది. అందులో చిక్కుకున్న ఐదుగురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. భవనం మూడు వైపులా ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించారు. దాదాపు 8 గంటలపాటు మంటలను అదుపు చేసేందుకు కష్టపడ్డారు. మంటలు విపరీతంగా ఎగిసిపడడంతో అదుపులోకి తీసుకురావడం కష్టమైంది.
అయితే.. భవనం ఎప్పుడైనా కూలొచ్చని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ వెల్లడించారు. ఒకవేళ భవనం కూలినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనా స్థలికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు.
మంటల ఉద్ధృతికి భవనం సమీపంలోకి వెళ్లే పరిస్థితులు లేకపోవటంతో సహాయచర్యలకు విఘాతం ఏర్పడింది. లోపల నుంచి పేలుడు శబ్ధాలు రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను ముందుగా తరలించారు. అనంతరం భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీతో పాటు మరిన్ని ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించారు.
పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 22 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది 8 గంటలపాటు కష్టపడి మంటలను అదుపు చేశారు.