ఉమ్మడి రాష్ట్రంలో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని అందించేవారని అన్నారు మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 ప్రభుత్వ హాస్పిటల్స్ లో మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని ఉస్మానియాలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ హాస్టల్స్ లో సన్న బియ్యంతోనే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు మనిషికి 6 కేజీల చొప్పున ఇంట్లో ఉన్న అందరికీ భోజనం అందించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు హరీష్ రావు. నాణ్యత గల భోజనం అందించడమే సీఎం లక్ష్యమని తెలిపారు. ఒక్కో నెల రోగి సహాయకుల కోసం 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని వెల్లడించారు. రోజుకి కనీసం 20 వేల మంది లబ్ధి పొందుతారని అంచనా వేశారు.
ప్రతి భోజనంపై ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ సంస్థకి 21 రూపాయల సబ్సిడీ ఇస్తోందని తెలిపారు హరీష్. వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని.. ఉస్మానియాలో 40 ఐసీయూ బెడ్స్ ప్రారంభించామని గుర్తు చేశారు. మరో 30 త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని విధాలుగా ఉస్మానియాని డెవలప్ చేస్తామని.. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియాలో కొత్త బిల్డింగ్ కట్టేందుకు కమిటీ వేశామని, హెరిటేజ్ బిల్డింగ్ తో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త బిల్డింగ్ నిర్మిస్తామన్నారు హరీష్ రావు. ఇక మూడు పూటలా భోజనం పథకంతో రోగి సహాయకులకు రోజూ మూడు పూటలా 5 రూపాయలకే భోజన వసతి లభిస్తోందని చెప్పారు.