ఈమధ్య కొంతమంది తమ హీరోయిజాన్ని చూపించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంబంధం లేని విషయాల్లో తలదూర్చి రచ్చకెక్కుతున్నారు. అలాంటి వారి జాబితాలోకి శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి చేరిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన విషయాలు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఛాన్స్ దొరికింది కదా అని నోటికి పనిచెప్పాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కి సెలబ్రీటీ అయిపోదామని అనుకున్నాడో ఏమో కానీ సంచలన కామెంట్స్ చేశాడు.
తాను హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం చేసుకున్నామని, ఆమె తన భార్య అని చెప్పుకొచ్చాడు. కాకపోతే తాము రహస్యంగా వివాహం చేసుకున్నామని ట్విస్ట్ ఇచ్చాడు. గుళ్లో వివాహం చేసుకున్నామని ఆసమయంలో మా వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా తీశారని తెలిపాడు. అయితే ప్రస్తుతం తాము విడిపోయామని కనుక ఆ పెళ్లి ఫోటోలు లేవని కామెంట్స్ చేశాడు.
శ్రీరామోజు సునిశిత్ చేసిన వ్యాఖ్యలతో లావణ్య త్రిపాఠి వార్తల్లోకెక్కింది. సునిశిత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొన్న లావణ్య అతనిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. తన ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యేలా ఇతడి కామెంట్స్ అవుతుండడంతో లావణ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.