లావణ్య త్రిపాఠి పెళ్లిపై వచ్చిన వదంతులు అన్నీ ఇన్నీ కావు. ఓ మెగా హీరోతో ఆమె డేటింగ్ చేస్తోందని, తరచుగా ఇద్దరూ కలుసుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ తెగ కథనాలు వచ్చాయి. లావణ్యకు ప్రపోజ్ చేసేందుకు ఓ డైమండ్ రింగ్ కొన్న హీరో, అది పట్టుకొని బెంగళూరు వెళ్లినట్టు కథనాలు వచ్చాయి.
వాటిపై అప్పట్లోనే లావణ్య స్పందించింది. తను బెంగళూరులో లేనని, డెహ్రాడూన్ లో ఉన్నానని తెలుపుతూ, పరోక్షంగా పెళ్లి-ప్రేమ వదంతులను ఖండించింది. ఇప్పుడు ఆమె మరోసారి మీడియా ముందుకొచ్చింది. ఆమె ఊహించినట్టుగానే ప్రేమ-పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంది. దీంతో మరోసారి స్పందించక తప్పలేదు.
“పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు. ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు. ఆమధ్య నా పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా చేతికి ఓ ఉంగరం ఉంది. ఇది ఎంగేజ్ మెంట్ రింగ్ మాత్రం కాదు. నేను నా డబ్బులతో కొనుక్కున్న ఉంగరం ఇది. ఇకనైనా రూమర్స్ ఆపండి.”
ఇలా తనపై వచ్చిన పెళ్లి వదంతులను మరోసారి ఖండించింది ఈ బ్యూటీ. లావణ్య త్రిపాఠి నటించిన తాజా చిత్రం హ్యాపీ బర్త్ డే. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.