పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలం తరువాత పవన్ చేస్తోన్న సినిమా కావడంతో వకీల్ సాబ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ దుమ్మురేపింది. మార్చి ఎనిమిదిన మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేయగా.. ఈ పాట అద్భుతంగా ఉందని ప్రశంసలను కూడా అందుకుంది.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌కల్యాణ్ సరసన శృతిహాసన్ నటిస్తుందని..కాదు ఇలియానా నటిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి మరో హీరోయిన్ పేరు వచ్చి చేరింది. ఆమె లావణ్య త్రిపాఠి. వీరిద్దర్నీ పక్కకు పెట్టి లావణ్యను తీసుకోవాలనే యోచనలో చిత్ర బృందం టాక్. ఇక ఇదే నిజమైతే పెద్దగా అవకాశాలు లేని లావణ్యకు మంచి అవకాశమనే చెప్పాలి. అందులోను పవన్ తో సినిమా లావణ్య త్రిపాఠి కెరీర్ పురోగతికి మరింత దోహదం చేయనుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.