జమిలి ఎన్నికలపై లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజీజు కీలక ప్రకటన చేశారు. లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏక కాలంలో నిర్వహించే అంశం ప్రస్తుతం న్యాయ సంఘం పరిశీలనలో ఉందని వెల్లడించారు.
జమిలీ ఎన్నికలపై లోక్ సభలో ఎంపీ భగీరథ చౌదరి ప్రశ్న లేవనెత్తారు. దీనికి కేంద్ర మంత్రి రిజీజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పలు భాగస్వామ్య పక్షాలతో తాము చర్చలు జరిపినట్టు తెలిపారు.
జమిలీ ఎన్నికలపై ప్రతిపాదనలు, సిఫార్సులు చేస్తూ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా సాధ్యాసాధ్యాలను అధ్యయం చేస్తూ ఒక నిర్ధిష్టమైన ప్రణాళికను తయారు చేసే పనిలో న్యాయ సంఘం ఉందన్నారు.
తరచుగా వస్తున్న ఎన్నికలు, నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదికలో స్టాండింగ్ కమిటీ పేర్కొందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో నిర్వహించడం వల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతోందని తెలిపారు.
2014-22లో 50 అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో ఎన్నికల నిర్వహణపై రూ. 7వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు ఉమ్మడి పౌర స్మృతిపై ఆయన స్పందించారు.
ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కొన్ని పిటిషన్లపౌ సర్వోన్నత న్యాయస్థానంలో ఇంకా విచారణ జరగాల్సి వుందన్నారు. వాటిపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే వరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబోమన్నారు.