అరెస్ట్‌తో గొంతు నొక్కాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. పోయిన పరువు కంటే.. మిగిలి ఉన్నదాన్నయినా కాపాడుకోవడమే మంచిదని అనిపించినట్టుంది. మంత్రి గంగుల కుటుంబం గ్రానైట్ బిజినెస్ అక్రమాలపై ప్రశ్నించిన కేసులో అరెస్ట్ అయిన అడ్వకేట్, కరీంనగర్ బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి ఎట్టకేలకు విడుదలయ్యారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకున్న కరీంనగర్ టూటౌన్ పోలీసులు.. అదే రాత్రి 11:30 నిమిషాలకు స్టేషన్ బెయిల్‌పై వదిలిపెట్టారు.
గ్రానైట్ బిజినెస్‌లో అవకతవకలకు పాల్పడిందని.. రూ. ఫైన్ చెల్లించాలని గంగుల ఫ్యామిలీకి చెందిన శ్వేత ఎజెన్సీస్‌కు ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గంగుల అక్రమాలపై గత కొన్నేళ్లుగా పోరాడుతున్న బేతి మహేందర్ రెడ్డి తొలివెలుగు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తనపై అవాస్తవాలు ప్రచారం చేశారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి గంగుల కంప్లెయింట్ చేశారు.
గంగుల ఫిర్యాదుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే.. బేతి మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంత్రి చేతిలో కరీంనగర్ పోలీసులు కీలుబోమ్మలుగా మారారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా అంటూ పోలీసుల తీరును రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఖండించారు. దీంతో బేతి మహేందర్ రెడ్డిని జైల్లో పెడితే ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగేలా ఉందని భావించిన మంత్రి, పోలీసులు.. ఆయన్ను విడుదల చేశారని తెలుస్తోంది. నిర్బంధాలతో నిజం దాగదని.. ఆ విషయాన్ని మంత్రి, పోలీసులు తెలుసుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు.