టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ చేతిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు.. చనిపోయే ముందు పుట్ట మధు పేరు చెప్పినట్టుగా ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ కూడా పుట్ట మధు పేరునే ప్రస్తావించడంతో.. ఆయనపై కేసు పెట్టడానికి అది ఆధారంగా పనికిరాదా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో చూసినవారందరి మదిలోనూ అదే అనుమానం తలెత్తుతోంది. అయితే దాన్ని సాక్ష్యంగానో, మరణ వాంగ్మూలంగానో భావించాలంటే చాలా అంశాలే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
వామన్‌రావు.. పుట్టమధు పేరు చెప్పినట్టుగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్ కచ్చితంగా సాక్ష్యంగా చెల్లుబాటు అవుతుందని కానీ.. అయితే అది ఎడిటింగ్ చేసిన వీడియో కాదని నిర్ధారణ కావాల్సి ఉంటుందని వారు అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో షేర్ అవుతున్న క్లిప్ కాకుండా..ఆయన మాటలను చిత్రీకరించిన అసలైన వ్యక్తిని కూడా విచారించాల్సి ఉంటుందని చెప్తున్నారు. వీడియో తీసిన ఫోన్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పస్టం చేస్తున్నారు.
మరణించేముందు బాధితుడు చెప్పే చివరి మాటలను ఎవరు రికార్డ్ చేసినా.. అది ఎవిడెన్స్‌గా పరిగణిస్తామంటూ గతంలో హైకోర్టు చెసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో నిజమైనదేనా. లేక ఎడిటింగ్ చేశారా.. వామన్‌రావు మాటలను రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై ఉత్కంట నెలకొంది.