పెద్దపల్లి జిల్లా మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, ఇతరుల పాత్ర గురించి ఆరా తీసేందుకు నిందితులు కుంట శ్రీనుతో పాటు మిగిలిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు వారిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంథని కోర్టులో రామగిరి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు బిట్టు శ్రీనివాస్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. అతన్ని లోతుగా విచారిస్తున్నారు. హత్య చేసేందుకు నిందితులకు కారు, కత్తులు సమకూర్చినట్టు అతనిపై ఆరోపణలు ఉండటంతో.. ఆందుకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. హత్యకు ముందు నిందితులతో ఫోన్ సంభాషణల్లో ఏమేం మాట్లాడారో ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 19నే హత్య కేసుల నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దాని ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరంగా చేస్తున్నారు.