హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో తాజాగా పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ హత్యోదంతంలోఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. రిటైర్డ్ ఇంజినీర్ వెల్ది వసంతరావును అదుపులోకి తీసుకున్నారు.
డిప్యూటీ డీఈఈగా పనిచేసి 2018లో రిటైర్ అయిన వసంతరావుకు కుంట శ్రీనుతో పరిచయం ఉంది. గుంజపడుగులో గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వామన్‌రావు ప్రయత్నించడంపై వసంతరావు ఆయనతో పలుమార్లు గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. ఈక్రమంలో వసంతరావు, అతని కుమారుడి అవినీతి బాగోతం బయపటపెడతానంటూ వామన్‌రావు లోకల్ వాట్సాప్ గ్రూపులో మెస్సేజులు పెట్టేవాడు. దీనిపై వసంతరావు ఆందోళన చెందేవాడు.
వామన్‌రావు బెదిరింపుల విషయాన్ని కుంట శ్రీనుకు చెప్పిన వసంతరావు.. ఎలాగైనా అయన అడ్డుతొలగించాలని కోరాడు. దీంతో వామన్‌రావు దంపతుల హత్య కేసులో వసంతరావును కూడా నిందితుడిగా చేరుస్తూ..పోలీసులు అరెస్ట్ చేశారు.