బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన గౌరవ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాకుండా.. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వరా అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి నిరంకుశ నిర్ణయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. బడ్జెట్ లోని ప్రతీ మాటకు ముందు, వెనుక కేంద్రంపై నింద వేస్తుంటే నిల్చొని నిరసన తెలిపితే సెషన్ అంతా సస్పెండ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్.
గతంలో ఇదే టీఆర్ఎస్ శాసనసభ్యులు ముఖ్యంగా ఇప్పుడు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన హరీష్ రావు.. గవర్నర్ ప్రసంగాన్ని, బడ్జెట్ కాపీలను చించేసి చైర్ పైకి విసిరేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మరి అప్పుడు హరీష్ ను జీవితకాలం సస్పెండ్ చేయాలిగా అంటూ సెటైర్లు వేశారు.
కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర సర్కార్ కూడా 12మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఈ విధంగానే రాజ్యంగ విరుద్ధంగా సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు. శాసన సభ్యుల హక్కుల్ని కాలరాయలేరని హితవు పలికారు. కేసీఆర్ నిరంకుశ, అరాచక పాలన ఇక ముందు సాగదని హెచ్చరించారు లక్ష్మణ్.