ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మన్సూరాబాద్ డివిజన్ యువనేత జక్కిడి రఘువీర్ రెడ్డి శుక్రవారం రెచ్చిపోయారు. హయత్ నగర్ సర్కిల్- 3 కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ మహిళా అధికారిపై బెదిరింపులకు దిగారు.
మీ సంగతి చూస్తానంటూ మహిళా అధికారికి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో నిన్ను ట్రాన్స్ ఫర్ చేయిస్తా చూడూ, మహిళ అయితే మాత్రం గౌరవం ఇవ్వాలా? అంటూ ఊగిపోయాడు.
వివరాల్లోకి వెళితే… హయత్‌నగర్ బంజారాకాలనీలో తమ 100 గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమంగా ఇండ్లు నిర్మించారని టౌన్ ప్లానింగ్ అధికారులకు రఘువీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ ఇంటిని కూల్చి వేయాలని అధికారులను ఆయన కోరారు.
ఆయన ఫిర్యాదు మేరకు జంజారాకాలనీలోని ఆ రేకుల ఇంటిని టీపీఎస్ ఉమా కూల్చివేయించారు. కానీ ఆ తర్వాత ఆ స్థలం తమదేనంటూ ఇంటి యాజమానులు తెలిపారు. దానికి సంబంధించిన సేల్ డీడ్ పత్రాలను అధికారులకు వారు అంద జేశారు. ఇక ఆ తర్వాత ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడే నివాసం ఉంటున్నారు.
దీనిపై రఘువీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అది తమ పని కాదని, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని ఉమా సూచించారు.
అప్పటికే ఆగ్రహంతో ఉన్న రఘువీర్ రెడ్డి ఉమా సమాధానంలో మరింత ఊగిపోయాడు. అసలు మీరున్నది ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండండి మీ సంగతి చూస్తాను… వారంలోగా మిమ్మల్ని ట్రాన్స్ ఫర్ చేయిస్తాను చూడండి అంటూ హెచ్చరించారు.