– ధరణిని గట్టిగా వాడేస్తున్న నేతలు
– తక్కువ మొత్తంలో భూముల కొనుగోళ్లు
– వందల ఎకరాలు కొనేస్తున్న బడాబాబులు
– ధరణిలో కనిపించకుండా ట్రిక్కులు
– పట్టించుకోని ప్రభుత్వం..!
– రియల్ దందాలోకి భారీగా బ్లాక్ మనీ
– త్వరలో.. తొలివెలుగు సంచలన కథనాలు
రియల్ రంగంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, దందాలు.. ఇలా ఎన్నో సంచలనాత్మక విషయాలను తొలివెలుగు బయటపెట్టింది. కనీసం స్పాట్ దగ్గరకు వెళ్లాలంటేనే అధికారులు భయపడిపోయే చోటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి.. ఆధారాలతో సహా కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ధరణి పేరుతో జరుగుతున్న దందాపై ఫోకస్ పెట్టాం. త్వరలో మా క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ స్టోరీస్ ను అందించబోతోంది. సామాన్యుల భూ సమస్యలను తొలగించాలనే లక్ష్యంతో ధరణిని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి.
ధరణితో కొత్త సమస్యలే వచ్చి పడ్డాయని లబోదిబోమనే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అయితే.. నాణానికి రెండో వైపు మాదిరిగా.. ధరణితో నాయకులు మాత్రం తెగ లాభపడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ లో భూముల విషయాలు ప్రైవేట్ గా పెట్టుకొనే సౌలభ్యం ఉంది. ఇది బడా బాబులకు వరంలా మారింది. వందల కోట్లు విలువ చేసే భూములను లక్షల రూపాయలకే కొని అందులో దాచేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండేందుకు బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునేందుకే భూ విక్రయాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాయకులు వందల కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసేసి రిజిస్ట్రేషన్ల సమయంలో మాత్రం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువ చేసే భూములు అని లెక్కల్లో చూపుతున్నారు. ధరణిలో భూముల గోప్యత ఆప్షన్ తో ఇష్టానుసారంగా కొనుగోలు చేసేయడం అందులో దాచేయడం జోరుగా సాగుతోంది. వరంగల్ నేతల బాగోతాన్నే తీసుకుంటే ఓ మంత్రికి 150, ఈస్ట్ 100, వెస్ట్ 100, వర్థన్న పేట 300, పరకాల 200 ఇవన్నీ ప్రభుత్వం కేటాయించిన నిధులు అనుకుంటే పొరపడినట్టే. అక్కడి నేతల మీద ఉన్న ఎకరాల భూములు.
వరంగల్ రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పుడైతే చర్చ ప్రారంభించిందో.. నేతలు ఇదే అదనుగా భావించి వందల ఎకరాలను వారి పేరు మీద, బినామీల పేరు మీద కొనుగోలు చేసేసి ధరణిలో పెట్టేస్తున్నారు. ఈ భూముల విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య పెద్దఎత్తున యుద్ధం జరుగుతోంది. కొనుగోలు చేసిన భూమిని లెక్కల్లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు మాత్రమే చూపిస్తున్నారు. నిజానికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ.80 లక్షల విలువ ఉంటుంది. ఇది కేవలం వరంగల్ లో మాత్రమే కాదు.. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సేమ్ సీన్.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత గిరిజన ధనవంతుడిగా పేరుగాంచిన మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరిట కొన్ని వందల ఎకరాల భూమి ఉందని సమాచారం. ప్రజల వద్ద నుంచి కొనుగోలు చేయడానికి నాయకులే కావాలని ఆ భూములను చిక్కుల్లో పడేయడం.. అమాయకులైన ప్రజల వద్ద నుంచి కేవలం లక్షల రూపాయలకు వాటిని దక్కించుకోవడం జరుగుతోంది. ప్రభుత్వానికి ఇదంతా తెలిసానా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి విదేశాల్లోని కంపెనీల్లో, సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే సరిపోయేది. కానీ, నేడు అవేమి అక్కర్లేదు. కేవలం భూముల మీద పెడితే చాలు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది.
ధరణిలో భూముల వివరాలు గోప్యంగా ఉంచి అందినకాడికి దోచుకుంటున్నట్లు తొలివెలుగు ఎప్పుడో బహిర్గతం చేసింది. జిల్లాల వారీగా ఏఏ నేతలు ఎంతెంత భూములు తమ గుప్పిట్లో ఉంచుకున్నారో.. ఎక్కడ నుంచి వారు కొనుగోలు చేశారో.. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే బయటపెట్టబోతోంది తొలివెలుగు క్రైంబ్యూరో.