- గెట్ టూ రెడీ ఆపరేషన్ ఆకర్ష్
- గులాబీ కోట నుంచి బిజెపి, కాంగ్రెస్ లోకి నేతల క్యూ
- కారు ఓవర్ లోడ్ తో దిగేందుకు సిద్ధమైన నేతలు
- పోటాపోటీ చేరికలతో ఇరు పార్టీల్లో జోష్
ఎన్నికలు దగ్గరకు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీల్లో నాయకుల జంపింగ్ లు జోరందుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణులు మొదలు బడా నేతల వరకు తమకు విజయావకాశాలు ఉన్న పార్టీకి వలస వెళ్లడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తంటాలు తెచ్చి పెడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం నెలకొంది. అయితే ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించాయి కాంగ్రెస్, బిజెపి పార్టీలు. ఆయా పార్టీల అగ్ర నేతల సంప్రతింపులతో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బిజెపిలోకి వలస వెళ్తున్నారు.
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్‌ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. కొన్ని సెగ్మెంట్లలో సొంత పార్టీకి చెందిన బలమైన నేతలతోనే పోటీపడే పరిస్థితి నెలకొంది. పైగా అంతర్గత విభేదాలు సైతం పార్టీని చిక్కుల్లోకి నెట్టాయి. దీనికి తోడు టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త పీకే సర్వే రిపోర్టు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలావరకు లీడర్లు గెలుపు కష్టమేననే నివేదికలో తేలడంతో గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే, ప్రస్తుత తరుణంలో సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు.. ప్రతిపక్ష పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ లో చిక్కుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే అసంతృప్త నేతలతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు.
కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల బొంతు జన్మదినం పురస్కరించుకుని పెద్దఎత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కాంగ్రెస్, బిజెపి నేతలు టీఆర్ఎస్ నేతలను పంచుకుంటున్నాయి.
ఇటీవల టీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగా, బిజెపి నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి సారథ్యంలో నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు.
అటు, తెలంగాణ బిజెపిలో చేరికలను ఉదృతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బలంగా ఫిక్స్ అయ్యారు. చేరికల ద్వారానే అధికార పార్టీ టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టి అధికారంలోకి రావచ్చనే ఆలోచనతో సంజయ్ ఉన్నారు. టీఆర్ఎస్ లో మొదటి నుంచి రాజేందర్ కీలకంగా వ్యవహరించడంతో, ఆ పాత పరిచయాల కారణంగా పెద్ద ఎత్తున నాయకులు బిజెపిలో చేరేందుకు అవకాశం ఉంటుందనే ఎత్తుగడకు బిజెపి రావడంతోనే రాజేందర్ కు ఈ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ను మొదలుపెట్టేందుకు సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో కమలం పార్టీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కూడా స్టార్ట్ చేసింది.. టీఆర్ఎస్‌లో ఉన్న బలమైన నాయకులని లాగేయాలని చూస్తోంది. అటు కాంగ్రెస్‌లో ఉన్న నాయకులని కూడా బీజేపీలోకి తీసుకురావాలని చూస్తుంది. అయితే బీజేపీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. మొత్తానికి అధికార పార్టీని ఇరుకునపెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచిచూడాలి.