తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరోసారి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. జిల్లాలోని రాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కణ సభలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో మల్లారెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మంత్రి తన స్పీచ్ ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో దళితులకు ఏ పార్టీ నాయకుడు ఏం చేయలేదని.. కానీ కేసీఆర్ మాత్రం దళితుల కోసం దళిత బంధు పథకంతో పాటు స్కూళ్లు, ఇతర పథకాలు ప్రవేశ పెట్టారని కొనియాడారు. దీంతో మంత్రి స్పీచ్ పై ఇతర పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పార్టీ మీటింగ్ కాదని, అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ అని మిగతా నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని, పార్టీ మీటింగ్ లో మాట్లాడుకోవాలని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మల్లారెడ్డి కూడా వాదించడంతో.. కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మల్లారెడ్డి స్టేజ్ దిగి వెళ్లిపోయారు.
కాగా మల్లారెడ్డికి ఇటీవల ఇటువంటి పరిణామాలు తరచూ ఎదురవుతున్నాయి. గతేడాది సొంత జిల్లా మేడ్చల్ లో జరిగిన రెడ్డి సింహ గర్జన సభలోనూ మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఈ సభలోనూ సీఎం కేసీఆర్ ను కీర్తిస్తూ ఆయన మాట్లాడటంపై సభకు వచ్చిన కార్యకర్తలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనం అయింది. సభలో పాల్గొన్న కొంతమంది మల్లారెడ్డిపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు.
వీడు మారడు ఇక … పెండ్లికాడ సావు పాటలా ? మేడ్చల్ నియోజకవర్గం పరువు గంగపాలు .. మొన్న రెడ్లు తరిమారు నేడు బహుజనులు తరిమారు #JaiMedchal #AngutiHatavo pic.twitter.com/Z1WBHAuJEG
— Teenmar Mallanna (@TeenmarMallanna) January 27, 2023