భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రాహుల్ బజాజ్ కన్నుమూశారు. పూణెలో ఆయన తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల రాహుల్ బజాజ్.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. బజాట్ ఆటో మొబైల్స్ సంస్థ ఛైర్మన్ పదవికి గత ఏడాది ఏప్రిల్ లో ఆయన రాజీనామా చేశారు.
ఆయన మరణంతో భారత దేశ పారిశ్రామిక, వ్యాపార రంగాలు విషాదంలో మునిగిపోయాయి. మన దేశ పారిశ్రామిక ప్రగతి కోసం ఎంతో కృషి చేసిన రాహుల్ బజాజ్ ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాహుల్ బజాజ్ మరణ వార్త తనను కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నానన్నారు. ఆయన మరణంతో ఎంతో కోల్పోతున్నానని చెప్పారు. మన దేశ నిర్మాతల్లో ఒకరైన గొప్ప కొడుకును దేశం కోల్పోయిందని అన్నారు.