గుణపాఠం నేర్చుకున్నామని, ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ తెలిపారు. నిజాయితీగా భారత ప్రధాని మోడీతో చర్చలు జరపాలనుకుంటున్నామని ఆయన అన్నారు. కశ్మీర్ వంటి జటిల సమస్యలను పరిష్కరించుకునేందుకు చిత్తశుద్ధితో ఉభయ పక్షాలూ కలిసి కూర్చుని చర్చించుకుందామని చెప్పారు. దుబాయ్ లోని అరబిక్ న్యూస్ ఛానల్ ‘అల్ అరేబియా’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. భారత ప్రభుత్వానికి తానిస్తున్న మెసేజ్ ఇదేనన్నారు.
శాంతియుతంగా మెలగుదాం.. పురోగమిద్దాం.. ఒకరితో ఒకరు కలహించుకుని సమయాన్ని, ఆస్తులను వృధా చేసుకునే బదులు ..ఈ ప్రక్రియ వైపు దృష్టి పెడదాం అన్నారు. ఇండియాతో పాకిస్తాన్ ఇప్పటికే మూడు యుద్దాలు చేసిందని, కానీ ఇవి వ్యక్తులకు (ప్రజలకు) మరింత భారాన్ని, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని మిగిల్చాయని ఆయన చెప్పారు.
మేం గుణపాఠం నేర్చుకున్నాం.. ఇక శాంతియుతంగా మెలగాలనుకుంటున్నాం.. కానీ ఇదే సమయంలో మన వాస్తవిక సమస్యలను పరిష్కరించుకునే సత్తా మనకు అవసరం అని షరీఫ్ వ్యాఖ్యానించారు. భారత, పాకిస్తాన్ దేశాలు రెండూ అణ్వస్త్ర దేశాలని, ఆయుధ సంపత్తి కలిగినవని చెప్పిన ఆయన.. ఒకవేళ యుద్ధమే వస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరుంటారు అని అన్నారు.
తమ దేశ ఎకానమీ దారుణంగా పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న తరుణంలోనూ, అప్పుల కోసం ఇతర దేశాలను దేబిరించవలసి రావడంతోను నిస్పృహగా పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వీటికి రాజకీయ అస్థిరత కూడా తోడై..పార్లమెంటులో తన ప్రభుత్వ విశ్వాసాన్ని నిరూపించుకోవలసిందిగా షరీఫ్ ని అధ్యక్షుడు డా. ఆరిఫ్ అల్వి త్వరలో కోరనున్నారు కూడా.. అటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘బూచి’ కూడా ఈ ప్రధానికి పొంచే ఉంది.