తెలంగాణలో రూ. వేల కోట్ల విలువైన భూదాన్ భూములు కబ్జాకు గురయ్యాయని అఖిల భారత సర్వ సేవా సంఘం, వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రభుత్వం వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుని.. నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేసి.. భూమి లేనివారికి వాటిని పంపిణీ చేయాలని కోరారు.
తెలంగాణ సర్వోదయ మండలి, తెలంగాణ సర్వ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అఖిలభారత సర్వ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు చందన్ పాల్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఎం రాష్ట్రకార్యవర్గ సభ్యులు నరసింహారావు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాల భూదాన్ భూములు.. భూ కబ్జాదారులు చేతుల్లో చిక్కుకుపోయాయని వక్తలు ఆరోపించారు. భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.