న్యాయ సహాయం మన న్యాయ వ్యవస్థలో ఓ భాగమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. రాష్ట్రంలో 23 జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో హైకోర్టు సెంట్రల్ హాల్‌లో వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 23 కొత్త జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలను ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మూడు అంచెల వ్యవస్థ అని వివరించారు. అతి తక్కువ సమయంలో 23 జిల్లా న్యాయ సేవల అథారిటీల ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయ సేవ అనేది స్వచ్ఛంద సంస్థ కాదన్నారు. అది ప్రతి ఒక్కరిపై ఉన్న రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సహాయ సలహాదారులు, పీఎల్‌వీలు, న్యాయ సహాయం, రాజ్యాంగ హక్కును అందించడం రాజ్యాంగ బాధ్యత అని చెప్పారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీలతో జిల్లాల పరిధిలోని పలు కేసులకు సంబంధించి న్యాయ సేవలు నిందితుల ముంగిట్లోకి రానున్నాయి. 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.