ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు నేపాల్ కు చెందిన కమీ రీటా షెర్పా(53). తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల17న 27వ సారి ఎవరెస్ట్ ను ఆయన ఎక్కాడు. అది జరిగిన వారంలోపే 28వ సారి కూడా ఎవరెస్ట్ ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాశారు.
బుధవారం ఉదయం 9:20 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తున ఎవరెస్ట్ పైకి కమీ రీటా చేరుకున్నట్లు ఈ పర్వతారోహణ యాత్రను నిర్వహించిన ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్’ మేనేజర్ చాంగ్ దావా షెర్పా తెలిపారు. కమీ రీటా మొదటిసారిగా 1994, మే 13న ఎవరెస్ట్ ను అధిరోహించారు.
ఇప్పటివరకూ 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న ఎన్నో ప్రసిద్ధ శిఖరాలను అధిగమించారు. ప్రస్తుతం ఆయన సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ లో సీనియర్ క్లైంబింగ్ గైడ్ గా పనిచేస్తున్నారు. కే2, లోట్సే పర్వతాలను కూడా కమీ రీటా అధిరోహించారు.