సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణాన్ని మరవకముందే మరో గొంతుక మూగబోయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
దక్షిణ కోల్‌కతాలోని తన ఇంట్లోని స్నానాల గదిలో కాలు జారి పడిన ఆమె.. గత నెల 27న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. సంధ్య ముఖర్జీకి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగానూ నిర్ధారణ అయింది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడమేకాక.. ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు.
చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం రాత్రి గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు సంతాపం ప్రకటించారు.
ఎస్‌డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన సంధ్య.. బంగ్ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లోకి ఎక్కారు.