వాడిపోతున్న పూలు వికసించి వాటి ‘జీవనకాలం’ పెంచాలంటే లెమన్ గ్రాస్ ఆయిల్ చాలా శ్రేష్ఠమైనదని నిపుణులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్ ఆయిల్ నే నిమ్మగడ్డి నూనెగా కూడా వ్యవహరిస్తున్నారు. నాజూకైన పూలు ఎండిపోకుండా ఎక్కువకాలం ఉండాలంటే ఈ నూనె మంచిదని హిమాచల్ ప్రదేశ్ లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ నిపుణులు వివరించారు. ఈ నిమ్మగడ్డి నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడైజింగ్ లక్షణాలు ఉంటాయట.
ముఖ్యంగా ‘గ్లాడియోలస్’ అనే వెరైటీకి చెందిన పూలను వీటి ఆకర్షణీయమైన రంగు కారణంగా ఎక్కువగా బొకేలలో వాడుతారు. కానీ వీటి జీవన కాలం పరిమితంగానే ఉంటుంది. ఫలితంగా మార్కెటింగ్, కమర్షియల్ వ్యాల్యూ కూడా లిమిట్ గానే ఉంటుంది. అందువల్లే వీటి లైఫ్ స్పాన్ పెంచడానికి నిమగడ్డి నూనె వాడాలన్నది రీసెర్చర్ల సూచన..
ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్ కి 5 మైక్రో లీటర్ల నిమ్మగడ్డి నూనెను వాడి ట్రీట్మెంట్ చేస్తే చాలు ఈ పూల జీవన కాలం 11 రోజులవరకు పెరుగుతుందట. సాధారణ డిస్టిల్డ్ వాటర్ తో అయితే ఇది 7 రోజులు మాత్రమేనని మీనాక్షి ఠాకూర్ తెలిపారు. అంటే ఈ నూనెను వినియోగించడం వల్ల.. ఈ పూలు మరో నాలుగు రోజులు అలాగే కళకళ లాడుతుంటాయని ఆమె చెప్పారు.
ఇతర పూల జీవన కాలాన్ని కూడా ఈ ఆయిల్ పెంచగలదని ఆమె తెలిపారు. కోసివేసిన పూలు ఫ్రెష్ గా ఉండాలంటే లోగడ సిల్వర్ నైట్రేట్, నానో సిల్వర్, క్యాల్షియం, హైడ్రోజన్ గ్యాస్ వంటివాటిని వాడేవారని.. కానీ ఇవి ఖరీదైనవని, మానవాళికి, పర్యావరణానికి కూడా హానికరమని ఆమె వివరించారు. ఇక లెమన్ గ్రాస్ ఆయిల్.. మానవుల ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.