రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతొంది. యాచారం మండలంలో పిల్లిపల్లి శివార్లలో ఆవు దూడను చంపి తినేసింది. దీంతో.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు చిరుతపులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బయటకు రావాలంటే భయంగా ఉందని.. వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని చిరుతపులి పాదముద్రలు సేకరించారు. భయాందోళనకు గురికావొద్దని ప్రజలు ధైర్యం చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.
గత ఏడాది నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది.గొర్రెల, దూడలపై దాడి చేస్తూ గ్రామాస్థులను భయాందోళనకు గురి చేసింది. అయితే తరువాత మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో పడడంతో అధికారులు దానిని నగరంలోని జూకు తరలించారు. కొంతకాలానికి అది మరణించింది.
అయితే ఇటీవల తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరుత సంచారం ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవల నిర్మల్ జిల్లాలో కుబీర మండల పరిధిలోని మర్లగొండ గ్రామ శివారులో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొందరు రాత్రి పూట అటువైపు వెళ్లడంతో చిరుత సంచారించడం చూసి తమ సెల్ ఫోన్ లో ఫోటోలను కూడా తీశారు. దీంతో సరిహద్దులోని గ్రామస్తులు చిరుత పులి బారి నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులను కోరారు.
ఏడాదిపాటు చిరుత భయం లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. యాచారం ప్రాంతంలో ఒకటే చిరుత ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇటీవల యాచారం మండలం మేడిపల్లి-నానక్‌నగర్ గ్రామాల మధ్య ఉన్న అడవిలో మరో చిరుత మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. దీనిపై అధికారులు సైతం ఈ విషయంపై తలలు పట్టుకుంటున్నారు.