హర్యానాలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్ లో చిరుత పోలీసులపై దాడి చేసింది. చిరుత దాడిలో ఓ పోలీస్ తోపాటు.. ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన హర్యానాలో ఆదివారం చోటుచేసుకుంది.
పానిపట్ జిల్లాలో బెహ్రాంపూర్ గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఆదివారం ఆపరేషన్ చేపట్టారు. తమ గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం చర్యలు చేపట్టింది.
చిరుతను పట్టుకునే క్రమంలో అది.. పోలీసులు, అటవీ అధికారులపైకి దూకి వారిపై దాడి చేసింది. కర్రలతో కొడుతూ చిరుతను భయపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. అది మాత్రం అందరిని హడలెత్తించింది. చిరుత దాడిలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు.
అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.