ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ, ఇంట్లోకి దూరింది ఓ చిరుతపులి. చడీ చప్పుడు లేకుండా ఇంట్లో అటూ ఇటూ తిరిగింది. ఒక్కసారిగా ఇంట్లోని కుటుంబ సభ్యులను పరుగులు పెట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారాలో జరిగింది. ఓ ఇంట్లోకి చిరుతపులి చొరబడి, గదుల్లో దర్జాగా తిరిగింది.
కోయానగర్‌కు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి ఓ చిరుతపులి చొరబడింది. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఓ గది తలుపు వద్ద కూర్చొని ఉన్న పులిని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
వెంటనే అరుపులు, కేకలతో బయటకు పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. తలుపులను మూసి గడియపెట్టారు. దీంతో ఏమైందా అంటూ గ్రామస్తులు బయటకు వచ్చారు. ఇంట్లోకి చిరుతపులి వచ్చిందన్న సమాచారంతో చుట్టు పక్కలవారు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు.
కిటికీల్లోనుంచి చిరుతపులిని వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులిని బోనులో బంధించి తీసుకెళ్లారు. ఈ మధ్య జనావాసాల్లోకి పలు వన్య మృగాలు వస్తున్నాయి. ఏనుగులు, జింకలు, పులులు ఇలా వచ్చి జనాలను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పులికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.