ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోకి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రవేశించిన ఓ చిరుతపులి అందర్నీ హడలెత్తించింది. దీన్ని చూడగానే లాయర్లతోబాటు అక్కడున్న అనేకమంది భయంతో పరుగులు తీశారు దీంతో అది మరింత పేట్రేగి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కొందరు లాయర్లు, కోర్టు పనుల నిమిత్తం వచ్చినవారు గాయపడ్డారు. ఓ మహిళా అడ్వొకేట్ తీవ్రంగా గాయపడగా ఆమెను కొంతమంది లాయర్లు కోర్టు వెనుక భాగం నుంచి తీసుకువెళ్లారు.
చిరుత దాడిలో తన చెయ్యి రక్తమోడుతుండగా కూర్చున్న ఓ వ్యక్తి, ముఖంపై రక్తం కారుతుండగా కర్చీఫ్ తో అద్దుకుంటున్న మరో వ్యక్తి ఫోటోలు, వీడియోలను యూజర్లు కొందరు అప్ లోడ్ చేశారు. మరికొంతమంది కాళ్లకు గాయాలయ్యాయి. సాహసించి చిరుతను అదిలించడానికి సిబ్బంది చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని పట్టుకునేందుకు వారు అటవీ శాఖకు సమాచారమిచ్చారు.
ఓ కిటికీ గ్రిల్ వెనుక గాండ్రిస్తూ కూచున్న చిరుతకు సంబంధించిన వీడియో తాలూకు ఫుటేజీ ఉన్నప్పటికీ, దీన్ని బంధించారా లేక ఇంకా అది అక్కడే ఉందా అన్న విషయం తెలియలేదు. ఏమైనా ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు ఉన్న పోష్ లొకాలిటీలోకి ఇది ఎలా ప్రవేశించిందన్నది మిస్టరీగా ఉందంటున్నారు.
గత నెల 23 న గ్రేటర్ నోయిడాలోని వెస్ట్ టెక్ జోన్ లో ఓ పైథాన్ ను స్థానికులు కనుగొని అటవీ శాఖకు సమాచారమిచ్చారు. అంతకుముందు డిసెంబరులో దాదాపు ఇదే ప్రాంతంలో ఓ చిరుతను చూసినట్టు కొంతమంది తెలిపారు. బహుశా ఆ చిరుత పులే ఇప్పుడు ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ప్రవేశించిందా అని అనుమానిస్తున్నారు.