పేరుకే నగరవాసులు..కానీ మరోసారి ఆది మానవులను మించిన అజ్ఞానాన్నే ప్రదర్శించారు. హైదరాబాద్‌లో ఉండటం అంటే అంతరిక్షంలో ఉన్నామనుకున్నారో లేక పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తే తిరిగిరామనుకున్నారో కానీ షరామాములుగానే గ్రేటర్ ఎన్నికలను లైట్ తీసుకున్నారు. తమ బతుకులు మార్చేవి.. నగర సమస్యలని తీర్చేవి అని తెలిసినా కనీసం కన్నెత్తి చూడలేదు. ఫలితం సాయంత్రం 5 గంటలు దాటినా కనీసం 40 శాతం పోలింగ్ కూడా కాలేని దుస్థితి.
పోలింగ్‌డేని కూడా హాలీడేగా ఫీలైపోయి ఎంజాయ్ చేసిన వారిని ఏమనాలి? మారుమూల పల్లెల్లోని ప్రజలు కూడా పరుగున వెళ్లి ఓటు వేసి వస్తున్న రోజుల్లో… మహానగరవాసులు మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోవడం ఏమిటి? 24 గంటలూ సోషల్ మీడియాలో పడి సోది చెప్పేందుకు చూపే ఉత్సాహంలో.. కనీసం ఒక గంటను తమను ఐదేళ్లు పాలించాల్సిన లీడర్ ఎన్నుకునేందుకు కేటాయించలేని హైదరాబాదీలని చూసి అసలు బాధపడాలా… జాలిపడాలా..?
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం లేని దేశాలు, ప్రజలు ఎందరో ఉన్నారు. కానీ ఎంతటి బలవంతుడినైనా గద్దె దింపే వజ్రాయుధంలాంటి ఓటు హక్కు ఉన్న దేశంలో జరగుతున్నది ఏమిటి? భాగ్యనగరవాసులకు ఓటుపై ఎందుకింత నిర్లక్ష్యం.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును వినియోగించుకోవడంలో కూడా ఎందుకింత నిర్లిప్తత? విశ్వనగర ప్రజల్లో ఉన్న పరిపక్వత ఇంతేనా..
సాయంత్రం ఐదు గంటల వరకు 35.8 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడం అత్యంత ఘోరం. ఇదే గ్రేటర్ ఎన్నికల్లో 2010లో 42 శాతం.. 2016లో 45 శాతం పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి పాత రికార్డులను దాటడం కూడా అనుమానంగానే ఉంది. వరుస సెలవులు రావడం, కరోనా భయం, వర్క్ ఫ్రమ్ హోం వంటివి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నా అవన్నీ ఉట్టి ఊరడింపు మాటలే. ఎందుకంటే గ్రేటర్ ఓటర్లు.. ఉత్త చీటర్లు.