మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేత, ముంబైలోని ఓర్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే సవాల్ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మీకు ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికార పగ్గాలు చేబట్టిన ఏక్ నాథ్ షిండే రాజ్యాంగ విరుద్ధంగా సీఎం అయ్యారని ఆరోపించిన ఆయన.. నా నియోజకవర్గం నుంచి మీరు ఎలా గెలుస్తారో చూస్తానని అన్నారు.
మీరే కాదు.. మీకు మద్దతునిచ్చిన 13 మంది ఎంపీలు , 40 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మళ్ళీఎలా ఎన్నిక కాగలరో చూస్తానన్నారు. 2022 జూన్ లో ఉద్ధవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టి షిండే ముఖ్యమంత్రి అయ్యారు. బీర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్ధవ్ వర్గానికి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది.
ముంబైలోని మహాలక్ష్మి మైదానం లో ఉన్న రేస్ కోర్స్ లొకేషన్స్ ని మరో చోటికి మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదిత్య థాక్రే తప్పు పడుతూ.. తనకు అనుకూలంగా ఉన్న బిల్డర్ లాబీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
అయితే ఈ కార్పొరేషన్ ని లోగడ.. నాటి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తన పిగ్గీ బ్యాంక్ గా వినియోగించుకుంటూ వచ్చిందని, ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కారణంగానే ఆదిత్య థాక్రే.. ఈ కొత్త సవాలు ‘పల్లవి’నెత్తుకున్నారని ఆయన ఆరోపించారు.