తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బాయిల్డ్ రైస్‌కు ఆదరణ లేదని.. ఎవరూ ఉపయోగించరని అన్నారు. నాలుగైదు ఏళ్లుగా బాయిల్డ్ రైస్‌ను వినియోగించడంలేదని చెప్పారు. ధాన్యం సేకరణకు 2014లో కేంద్ర ప్రభుత్వం రూ. 3,400 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతేడాది ధాన్యం సేకరణకు కేంద్రం రూ. 26,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముడి బియ్యం ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ఒప్పందాల ప్రకారం చివరి గింజ వరకు కొంటామని వెల్లడించారు. దేశంలో ముడి బియ్యం స్టాక్ పేరుకుపోతుందన్నారు. రాజకీయాల కోసం ధాన్యం కొంటే ప్రజాధనం వృథా అవుతుందనేది టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధాని గడ్డం, బట్టలపై విమర్శలు చేయడం తన స్థాయిని తగ్గించుకోవడమేనన్నారు.
సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు కార్యాచరణ ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విదేశాలకు బియ్యం ఎగుమతి చేయలేదని.. అందుకే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారూ మందుకురావడం లేదన్నారు.
భద్రాచలానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రైల్వే లైన్ వేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైన్ వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్ర మంత్రి.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. టెక్స్టైల్ పార్క్, ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశ భవిష్యత్ కోసం తాము బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. తెరాస ప్రభుత్వం మాత్రం వారి భవిష్యత్ కోసం బడ్జెట్ పెడుతున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.