JEE, NEET పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రాజకీయ పక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల వాయిదాను కోరుతోంటే.. విద్యావేత్తలు, నిపుణులు మాత్రం ఎలాగైనా జరపాలని సూచిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై రాజీపడినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. పరీక్షల నిర్వహణను రాజకీయం చేయొద్దని.. వారి భవిష్యత్తును పణంగా పెట్టొద్దని కోరుతున్నారు.ఈ మేరకు దేశ, విదేశాల యూనివర్సిటీలకు చెందిన 150మందికిగా ఇండియన్ ప్రొఫెసర్లు కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. విపక్షాలు పరీక్షల వాయిదాకు డిమాండ్ చేస్తున్న సమయంలో.. వీరు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
JEE పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6 వరకు, NEET సెప్టెంబర్ 13న నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమైన దృష్ట్యా.. పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.