కాంగ్రెస్ హైకమాండ్‌కు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య రాసినట్టు చెబుతున్న ఓ లేఖ కలకలం రేపుతోంది. దీనిపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. ఆ లేఖ నకిలీదని ఆయన పేర్కొన్నారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకే ఆ లేఖను లీక్ చేశారంటూ ఆయన వెల్లడించారు.
పార్టీ కార్యకర్తలను పార్టీపై అయోమయానికి గురి చేసి తద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలకు గండికొట్టాలనే ఉద్దేశంతోనే లేఖను లీక్ చేశారంటూ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అలాంటి లేఖను రాయలేదని ఆయన వెల్లడించారు.
ఇది ఒక హానికరమైన నకిలీ లేఖ అని ఆయన అన్నారు. ఇలా తమ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ కార్యకర్తలు కుట్ర పన్నారని ఆయన చెప్పారు. ఈ లేఖపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని కోరతానన్నారు.
ఇది ఇలా వుంటే టికెట్ల పంపిణీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పార్టీ హై కమాండ్ కు రాశారంటూ ఓ లేఖ వైరల్ అవుతోంది.
లేఖలో ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీని సంభోదిస్తూ ఉంది. పార్టీలో టికెట్ల విషయంలో విభేదాలు తలెత్తాయని లేఖలో పేర్కొన్నారు. విభేదాలు ఇలాగే కొనసాగితే పార్టీలో తిరుగుబాటు తప్పదంటూ లేఖలో చెప్పారు. తాజాగా ఈ లేఖ విషయాన్ని సిద్ధరామయ్య కొట్టిపారేశారు.