అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం ఆదానీ గ్రూప్ పై భారీగా పడింది. కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. కేవలం నిన్న ఒక్క రోజే ఆదానీ గ్రూపునకు చెందిన షేర్లు రూ. 3.37లక్షల కోట్ల నష్టాలను చవి చూశాయి. దీంతో ఆదానీ కంపెనీల్లో నాన్ ప్రమోటర్ దేశీయ షేర్ హోల్డర్‌గా ఉన్న ఎల్ఐసీకి రూ. 16,627 కోట్ల నష్టం వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆదానీ గ్రూపుల్లో రూ. 72,193 కోట్లుగా వున్న షేర్ల విలువ శుక్రవారం నాటికి రూ. 55,565 కోట్లకు పడిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే 22శాతం నష్టాలను పొందాయి. మరోవైపు ఎల్ఐసీ షేర్ల ధరలు కూడా శుక్రవారం భారీగా పడిపోయాయి. నిన్న ఎల్ఐసీ షేర్ల ధరలు 3.5శాతం పడిపోయాయి.
ఈ క్రమంలో ఎల్ఐసీ,ఎస్బీఐ లాంటి ఆర్థిక సంస్థల్లో వందలాది మంది భారతీయులు పెట్టిన సేవింగ్స్, ఆర్థిక స్థిరత్వం పై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అదానీ గ్రూప్ అనేది చిన్న సంస్థ కాదనీ కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆ సంస్థకు మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల ఆదానీ సంస్థపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ గవర్నెన్స్, రుణ భారం ఆరోపణల నేపథ్యంలో పలు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించకపోయినప్పటికీ కొన్ని ప్రభుత్వ రంగం సంస్థలు మాత్రం ఆదానీ గ్రూపునకు ఆర్థిక సహాయం చేశాయని ఆయన అన్నారు. ఎల్ఐసీ ఈక్విటీ ఆస్తుల్లో 8 శాతం రూ. 74,000 కోట్ల భారీ మొత్తాన్ని అదానీ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలన్నీ వాస్తవమని తేలితే ఎన్నో ఏండ్లు కష్టపడి ఎల్ఐసీ, ఎస్బీఐల్లో పొదుపు చేసిన కోట్లాది మంది భారతీయుల జీవితాలు నాశనం అవుతాయని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరీ అన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై ఎస్బీఐ చైర్మన్ స్పందించారు.
ఆదానీ కంపెనీ గురించి వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ అన్నారు. ప్రస్తుతానికి తమకు ఎటువంటి ఆందోళన లేవని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఎస్బీఐ నుంచి ఆదానీ గ్రూప్ ఎలాంటి నిధులు సేకరించలేదని చెప్పారు. సమీప భవిష్యత్తులో వారి నుండి ఏదైనా నిధుల కోసం అభ్యర్థనలు వస్తే దానిపై బ్యాంక్ విచారణలు జరిపి సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని పేర్కొన్నారు.