ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లోని 16వ అంతస్తు నుండి లిఫ్ట్ జారీ కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మందితో పైకి వెళ్తున్న లిఫ్ట్ తీగ తెగిపోవడంతో అంత్యంత వేగంగా కిందకు జారి పడిపోయింది.
ఈ దుర్ఘటనలో ఒకరు స్పాట్ లో చనిపోగా, మరో ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాద ఘటనపై కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు ఎటువంటి సేఫ్టీ లేకుండా పని చేయడం వల్లనే శనివారం ముగ్గురు మృతి చెందారని కార్మికులు ఆరోపించారు. మృతి చెందిన వారిని తమకు తెలియకుండానే బయటకు పంపేయటంపై కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
చనిపోయిన ఇద్దరు వ్యక్తులను ఇక్కడికి తీసుకువచ్చేంతవరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదని ఆందోళన చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కార్మికులను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఏ అధికారి కూడా సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో కార్మికులు నిరసన చేపట్టారు.