ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు చెప్పారు.
నేపాల్ లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు వెల్లడించింది. ఇటీవల నేపాల్ తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
మరోవైపు చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూమి కంపించినట్టు వార్తలు వచ్చాయి. మెట్రో రైల్ పనుల వల్ల ప్రకంపనలు వచ్చి వుంటాయనుకున్నారు. కానీ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ దాన్ని తిరస్కరించింది. తాము ఈ రోజు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదని తెలిపింది. దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
ఈ నెల 24న నేపాల్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూకంపం వల్ల ఆరుగురు మరణించారు.