అది పెద్ద లోయ ప్రాంతం. ఎటు చూసినా వరుసగా కనిపించే ఎత్తైన కొండలు. ఆ కొండల మధ్యలో కనిపించే అందమైన లోయ ప్రాంతాలు. ఎవరో స్కేలు పట్టుకుని వచ్చి కొలిచి చెక్కినట్టుగా అందంగా సమానంగా ఎగుడు దిగుడుగా ఉండే ఆకారాలు. వాటి మధ్య చక్కని రహదారి. చూస్తే పెయింటింగ్ లాగా కనిపించే ప్రాంతమది.
ప్రకృతి స్వయంగా బ్రష్ పట్టుకుని అద్భుతమైన పెయింటింగ్ వేసిందా?అన్నట్టుగా కనిపించే ప్రాంతమది. ఇవన్నీ విని ఇదేదో దూర దేశంలోని ప్రదేశం అనుకుంటున్నారేమో కానీ కాదు. ఇది అచ్చంగా మన దేశంలోదే. అవునండి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితిలోయ ప్రాంతం.
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయను ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెబుతారు. శీతాకాలంలో గడ్డకట్టిన మంచు, వేసవిలో హిమనీనదంగా మారి ప్రవహించడంతో లోయలో1 మనోహరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన స్పితి లోయలోని అందమైన దృశ్యాలను నార్వేకు చెందిన దౌత్యవేత్త ఎరిక్ సోల్ హేమ్ ట్వీట్ చేశారు.
లోయ ప్రాంతంలో రంగులను అరుణ గ్రహం మీద ఉన్న ప్రాంతంతో పోల్చుతూ కామెంట్స్ పెట్టాడు. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ ప్రాతమన్నారు. ఇక్కడ ఉంటే మార్స్ మీద రైడ్ చేసినట్టుగా ఉందన్నారు.అందువల్ల అందరూ అద్భుతమైన భారత్ కు వెళ్లండి. హిమాచల్ లోని స్పితి లోయను చూడండని ట్వీట్ చేశారు.
ఎరిక్ పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి నెటిజన్లు తెగ లైక్ లు కొట్టేస్తున్నారు. అచ్చం పెయింటింగ్ లాగా చాలా అద్భుతంగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశానికి జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లి తీరాల్సిందేనని మరికొందరు అంటున్నారు.