తల్లిదండ్రులు సాధించిన ఘనతలనే వారి పిల్లలు కూడా సాధించాలని ఏమీ లేదు. ఎవరైనా వారికి ఇష్టం ఉన్న అంశంలో అయితేనే ప్రతిభ చాటుతారు. అయితే ఆ బాలిక మాత్రం అచ్చం తన తల్లిలాగే రాణిస్తోంది. అందులో భాగంగానే ఆమె తన తల్లి పొందినట్లే ఓ జాతీయ రికార్డును కూడా సాధించింది. 15 ఏళ్ల పావన నాగరాజ్ అనే బాలిక ఇటీవల నిర్వహించిన అండర్ 16 జాతీయ హై జంప్ పోటీల్లో రికార్డు సృష్టించింది. గౌహతిలో జరిగిన ఆ పోటీల్లో ఏకంగా 1.73 మీటర్ల ఎత్తు హై జంప్ చేసి రికార్డు సాధించింది.
పావన తల్లి సహన కుమారి అప్పట్లోనే హై జంప్‌లో జాతీయ రికార్డును సాధించింది. 2012లో జరిగిన పోటీల్లో ఆమె 1.92 మీటర్ల హై జంప్ చేసి రికార్డు క్రియేట్ చేస్తే ఇప్పుడు పావన మళ్లీ అదే క్రీడలో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఆమె ఇంట్లో ప్రస్తుతం ఇద్దరు జాతీయ రికార్డు హోల్డర్లు ఉన్నట్లు అయింది. అచ్చం తల్లిలాగే ఆమె రికార్డు క్రియేట్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పావన తండ్రి నాగరాజ్ పేరిట కూడా ఓ రికార్డు ఉంది. 2010లో ఫాస్ట్‌స్ట్ మ్యాన్ ఇన్ ఇండియాగా పేరుగాంచాడు. 100 మీటర్ల స్ప్రింట్‌ను తక్కువ వ్యవధిలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఇక ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో అంతే దూరాన్ని కేవలం 10.50 సెకన్లలోనే పూర్తి చేశాడు. కాగా వీరిది బెంగళూరు. అక్కడ ఎస్ఏఐ అకాడమీ పేరిట ఎంతో మందికి వీరు శిక్షణ అందిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే పావన గతేడాదే ఈ రికార్డును సాధించి ఉండేది. కానీ ఎట్టకేలకు ఇటీవల పోటీలు నిర్వహించడంతో ఆమె రికార్డు సృష్టించింది. ఆమె తల్లి కూడా అదే గేమ్‌లో చాంపియన్ కావడం, ఇప్పుడు ఆమె రాణించడం నిజంగా యాదృచ్ఛికమే అయినా ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. క్రీడాకారుల పిల్లలు మళ్లీ క్రీడాకారులుగా రాణించడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది.