నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
దీంతో ముందుగానే నిర్ణయించిన తేదీ ప్రకారం.. జనవరి 27న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
అయితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని అయినా పాదయాత్రను కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. మరోపక్క అనుమతి కోరుతూ పోలీసులకు పలు లేఖలు రాసింది. ఈక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది.
ఇక లోకేష్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక నిర్ణయించిన ముహూర్తానికే పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే లోకేష్ పాదయాత్రకి కొన్ని షరతులు విధించారు పోలీసులు.
పాదయాత్రకు షరతులు:
- బహిరంగ సభలను నిర్ణీత సమయాలకే నిర్వహించాలి.
- రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు.
- పాదయాత్రలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగానే తెలియజేయాలి.
- శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా పాదయాత్ర కొనసాగించాలి.
- సభా ప్రాంగణంలో ప్రాథమిక చికిత్స శిభిరాలు ఉండేలా చూసుకోవాలి.
- అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటు ఉంచుకోవాలి.