రూల్స్ కు అతీతంగా వాహనాలు నడుపుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఫోటోలు కొట్టి ఫైన్ వేస్తారు పోలీసులు. ఇలాగే ఓ వ్యక్తి బైక్ కు చలానా విధించారు. తన బైక్ కు చలానా విధించారనే కోపంతో పోలీస్ స్టేషన్ కు విద్యుత్ నిలిపివేశాడు ఓ లైన్‌మెన్. ఈ ఘటన బీహార్ లోని వైశాలి జిల్లాలో జరిగింది.
జిల్లాలోని హర్దాస్‌పూర్ ఇన్‌స్పెక్టర్ సాయంత్రం పత్రాలు లేని వాహనాలకు ఫైన్ లు రాస్తున్నారు. ఈ క్రమంలోనే బరేలీకి చెందిన లైన్‌మెన్ భగవాన్ స్వరూప్ బైక్‌ను ఆపి చెక్కింగ్ చేశారు. బైక్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించమని లైన్‌మెన్ అడిగాడు.
తన దగ్గర లేవని.. పత్రాలు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పాడు లైన్‌మెన్. పట్టుబడిన సమయంలో తన వద్ద బైక్ కాగితాలు లేకపోవడంతో 500 రూపాయలు జరిమాన విధించాడు ఎస్సై. దీంతో ఆగ్రహం చెందిన ఆ లైన్‌మెన్ పోలీస్ స్టేషన్ కు ఆ రోజు రాత్రి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
ఎంత సేపటికి కరెంట్ రాకపోవడంతో ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు పోలీసులు. దీనిపై అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను చెప్పినప్పటికీ.. పోలీసులు వినకుండా తన బైక్ కు చలానా విధించారనే కోపంతో కరెంట్ కట్ చేశానని ఒప్పుకున్నాడు భగవాన్. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్ లో విద్యుత్ సరఫరాకు మీటర్ లేదని.. అక్రమాలకు పాల్పడుతున్నారని లైన్‌మెన్ ఆరోపించాడు.