అమరావతి: ముఖ్యమంత్రి జగన్ కు పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. కరకట్ట పై ఉన్న అతిధి గృహం కూల్చివేత నోటీసులపై లింగమనేని రమేష్ రాసిన 5 పేజీల లేఖ ఆలోచింపజేస్తోంది. కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది ఒక్క లింగమనేని కుటుంబం మాత్రమే కాదని స్పష్తం చేయడం జరిగింది. సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశానిస్పృహల్లోకి నెట్టివేస్తుందన్నారు.
నిర్మాణాత్మకంగా సాగుతుందనుకున్న ప్రభుత్వం కూల్చివేతకే ప్రాధాన్యం ఇస్తుందా? అనే ప్రశ్న ప్రజల్లో ఉదయించింది. కరకట్టపై మొదలైన ఈ ప్రక్రియ తమ ప్రాంతాలకు వేర్వేరు కారణాలతో వస్తుందనే ఆందోళన రాష్ట్రమంతా ఉంది. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరని సీఎంకు లింగమనేని ప్రశ్న.
ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు.? ఉండవల్లిలోని అతిధి గృహానికి 2012లో అప్పుడు ఉన్న చట్టపరమైన అన్ని అనుమతులూ పొందామని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్.ఓ.సి. కూడా తీసుకున్నామని, నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే అతిథి గృహాన్ని నిర్మించామని లేఖలో పేర్కొన్నారు.
2014లో ఇక్కడ నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితులు నెలకొన్నాయి, అధికారులు తగిన గృహం కోసం అన్వేషించి, కరకట్ట మీద ఉన్న తన అతిథి గృహాన్ని చూసి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి యోగ్యంగా ఉంటుందని భావించారు.
ఆ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనకు తావు లేకుండా అంగీకారం తెలిపానని లింగమనేని లేఖలో వివరించారు. ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందులో లేవని, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా స్పందించి రాష్ట్ర పాలన బాధ్యతలు చూసే ముఖ్యమంత్రికి తగిన నివాసం ఇవ్వడం తన ధర్మంగా భావించానని తెలిపారు.
ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మరే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే రీతిలో స్పందించేవాడినని లింగమనేని స్పష్టం చేశారు.
బహిరంగ చర్చకు సిద్దం: ఎమ్మెల్యే ఆర్కే
ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు లింగమనేని లేఖపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిస్పందించారు. లింగమనేని గెస్ట్ హౌస్‌కు ఒక్క అనుమతి కూడా లేదని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. లింగమనేని రమేష్ లేదా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. లింగమనేని రమేష్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్ విసురుతున్నానని, బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా హాజరవుతానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.