ఎప్పుడు చికెన్, మటన్ డిషెస్ యేనా వెరైటీగా ఏం లేవా.. అని చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే.. అలాంటి వారి కోసం ఇప్పుడు సింహం, పులి, జీబ్రా, ఏనుగు మాంసాలతో కొత్త కొత్త వంటకాలు అందుబాటులోకి రానున్నాయి. సింహం బర్గర్, పులి మాంసం నగ్గెట్స్, ఏనుగు నూనెతో చేసిన క్రీమీ చీజ్ కేక్, జీబ్రా సుషీ రోల్స్, జిరాఫీ హ్యామ్.. త్వరలో జరగబోయే ఓ ఫుడ్ ఫెస్టివల్ మెనూ లిస్ట్ ఇది. నమ్మట్లేదు కదా.. ఏప్రిల్ మాసం వచ్చింది ఫూల్స్ చేయడానికి చెబుతున్నారని అనుకుంటున్నారు కదు.. కానీ, నిజంగా త్వరలో పులి, సింహం, జీబ్రా, ఏనుగు వంటి మాంసాలు దొరకనున్నాయి. దీనికోసం ఓ సంస్థ అడుగేసింది.
మాంసాహారాలు అంటే.. చికెన్, మటన్, బీఫ్, పోర్క్ దాదాపు అన్ని దేశాల్లో వీటినే తింటారు. చైనాలో అయితే పిల్లులు, కుక్కలతో సహా అన్ని ఆరగిస్తారు. కానీ, ఏ దేశాలు కూడా వన్యమృగాలు జోలికి వెళ్లవు. వాటిని వేటాడడం, తినడం చట్టవిరుద్ధం. అసలు వాటిని తినాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. ఇందుకు భిన్నంగా సింహం, పులి, జీబ్రా మాంసాలను అందించడానికి లండన్ కేంద్రంగా ఓ సంస్థ సిద్ధమైంది.
ప్రిమేవల్ ఫుడ్స్ అనే అంకుర సంస్థ సెల్యూలర్ వ్యవసాయంతో ముడిపడిన వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్ లోనే వన్యమృగాల మాంసాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని అనుకుంది. ల్యాబ్ లో మాంసం అభివృద్ధి కొత్తేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్(సెల్ కల్చరింగ్) చేసి పరిశోధనశాలలోనే తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి.
Advertisements
స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లలో సింహం, పులి, జీబ్రా మాంసాలను విక్రయించనున్నారు. త్వరలో ఈ సంస్థ ఫుడ్ ఫెస్టివల్ ను కూడా నిర్వహించనుంది. అక్కడ రకరకాల వంటకాలను చేసి పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఓ మెనూను కూడా విడుదల చేశారు.