అసెంబ్లీలో బ్రెత్ ఎనలైజర్లు.. తాగుబోతు ఎమ్మెల్యేలకు చెక్!

సోమవారం నాటి బడ్జెట్ సమావేశాల ప్రారంభ రభస.. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో మరో మాయని మరక! ఇందులో సందేహమే లేదు. గవర్నర్ పక్కనున్న సభాపతిని గాయపర్చడమంటే.. అది గవర్నర్ మీద దాడిగానే పరిగణించాలన్నది ఒక డిమాండ్. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ సెట్ ను పోడియం వైపు విసరడం.. అది కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి ఆయన్ను ఆస్పత్రిపాలు చేయడం.. ఇవ్వాల్టి బ్రేకింగ్ న్యూస్. కానీ.. ఈ ముతకబారు వార్త మాటునుంచి మరింత ‘మలిన’వార్తలు కూడా పొంగుకొస్తున్నాయి. అసెంబ్లీలోకి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగి తూలుతూ వస్తున్నారని, ఒక ఎమ్మెల్యే ఏకంగా సీఎల్పీ లీడర్ జానారెడ్డి మీద పడిపోయారని చెప్పుకొచ్చారు తెరాస లెజిస్లేటివ్ కౌన్సిల్ విప్ పల్లా రాజేశ్వర్. గవర్నర్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘ఆన్’లో వున్నారన్న పల్లా వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ”దమ్ముంటే నేను తాగి సభకొచ్చానని ప్రూవ్ చేయండి.. నేను కాదు మీరూ, మీ సీఎం పక్కా తాగుబోతులు… ప్రగతిభవన్లో ప్రతిరోజూ మద్యం ఏరులై పారుతున్న విషయం ఎవరికీ తెలీదనుకుంటున్నారా?’ అంటూ కోమటిరెడ్డి రంకెలేశారు. ఈ మొత్తం వ్యవహారం అసెంబ్లీ రూల్ బుక్ మీద ప్రభావం చూపేలా ఉందని.. భవిష్యత్తులో సభకొచ్చే ప్రతీ సభ్యుడు.. బ్రెత్ ఎనలైజర్ తో ఊదించుకుని వచ్చేలా కొత్త నిబంధన అమల్లోకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.