ఇంట్లో నల్లా తిప్పగానే లిక్కర్ వచ్చిందనుకో…ఏమనిపిస్తోంది..? ఏమనిపిస్తుంది.! మద్యం ప్రియులయితే మరో వ్యక్తికి చెప్పకుండా ఇంట్లో ఉన్న బిందెలు, గిన్నెలు అన్నింట్లో నింపుకుని చుట్టాలు, బక్కాలకు కబురంపుతారు…అదే మద్యం అలవాటు లేని వాళ్లయితే అగ్గి మీద గుగ్గిలం లాగా మున్సిపల్ అధికారులపై మండిపడతారు…అంతేకదా..ఇప్పుడు కేరళలో అదే జరిగింది.
కేరళలోని త్రిసూరు జిల్లా చలకూడి మున్సిపాల్టీలోని కె.ఎస్.ఆర్.టి.సి బస్టాండ్ సమీపంలో సాల్మన్స్ ఎవెన్యూ అపార్ట్ మెంట్ ఉంది. 18 కుటుంబాలు ఆ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాయి. రోజు మాదిరిగానే బుధవారం లేచి నల్లా ఓపెన్ చేసిన ఆ కుటుంబాలకు నల్లాలో నీళ్లకు బదులు మద్యంతో కూడిన నీళ్లు వచ్చాయి. దీంతో ఆశ్యర్యానికి గురైన ఆపార్ట్ మెంట్ వాళ్లంతా ఒకరినొకరు ప్రశ్నించుకొని అన్ని ఇళ్లల్లో అలానే వస్తున్నాయని నిర్ధారించుకున్నారు.
అసలు ఇంతకీ నీళ్లలో మద్యం రావడం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. 18 కుటుంబాలు నివసించే సాల్మన్స్ అపార్ట్ మెంట్ పక్కనే రచన అనే బార్ షాపు ఉంది. ఆరేళ్ల క్రితం ఆ బారు షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 6000 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కేసు, కోర్టు ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఆ అక్రమ మద్యాన్ని పారబోయాలంటూ కోర్టు ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించింది. దాన్ని ఏ విధంగా పారబోయాలో ఆలోచించిన ఎక్సైజ్ సిబ్బంది చివరకు ఓ నిర్ణయానికొచ్చారు. ఎక్కడైతే అక్రమ మద్యం పట్టుకున్నారో అదే బార్ షాపు ఆవరణలోనే దాన్ని పారబోయాలని నిర్ణయించుకున్నారు.
బార్ ఆవరణలో ఓ 10 ఫీట్ల లోతు పెద్ద గుంట తవ్వి ఒక్కో బాటిల్ మూత తీసి ఆ గుంటలో పోసేశారు. 6000 లీటర్ల మద్యాన్ని అలా గుంటలో పారబోయడానికి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమయం పట్టింది.
సాల్మన్ అపార్ట్ మెంట్ కు చెందిన మంచినీళ్ల బావి ఆ బార్ పక్కనే ఉంది. బార్ ఆవరణలోని గుంటలో పోసిన మద్యమంతా భూమిలో గుండా అపార్ట్ మెంట్ కు చెందిన బావిలోకి వెళ్లింది. ఈ నీళ్లన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి ఎక్కించడంతో సమస్య మొదలైంది. అపార్ట్ మెంట్ వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేసే సరికి ఎక్సైజ్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి ఎలాంటి గొడవ సృష్టించవద్దని వేడుకున్నారు. బావిని మొత్తం శుభ్రం చేస్తామని…అప్పటి వరకు మంచినీళ్లు వేరే చోట నుంచి తెప్పిస్తామని బ్రతిమాలాడారు. అయినప్పటికీ అపార్ట్ మెంట్ వాసుల కోపం చల్లారలేదు. తప్పు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ చలకూడి మున్సిపల్ సెక్రెటరీకి, వైద్యా శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.