సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో ఐదుగురు నిందితులకు రౌజ్ ఎవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు ఎక్సైజ్ శాఖ మాజీ ఉద్యోగులు. లిక్కర్ స్కామ్ గా పాపులర్ అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.
రౌజ్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ మంగళవారం లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూతా గౌతమ్ లకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేశారు. ఈ ఐదుగురికి ఈ కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
వారిని సీబీఐ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వీరిలో కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లు ఎక్సైజ్ శాఖలో మాజీ ఉద్యోగులు. బెయిల్ లభించినప్పటికీ.. వ్యాపార వేత్త సమీర్ మహేంద్రు ఇంకా జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు. సీబీఐ విచారిస్తున్న కేసుకు సంబంధించి బెయిల్ లభించినప్పటికీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసులో ఇంకా బెయిల్ లభించకపోవడంతో సమీర్ మహేంద్రు జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి లకు ఇప్పటికే రౌజ్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎక్సైజ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై నమోదైన ఈడీ కేసు కారణంగా వారు కూడా జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కోర్టు ఆయనకు మార్చి 4 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. వీరిలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిలను సీబీఐ అరెస్ట్ చేసింది.