తెలంగాణలో అభివృధ్ధి పథకాలు ఇంటింటింకి అందుతాయంటే ఏమో అనుకున్నాం కానీ.. సీఎం కేసీఆర్ ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపుతారని ఊహించలేదని అంటున్నారు ప్రజలు. అసలు అంత అభివృద్ది ఎక్కడ జరిగింది..? ఎం చేశారు..? అనుకుంటున్నారా. అయితే ఈ విషయం గురించి మీకు తెలియాల్సిందే.. ఇంటింటింకి నల్లా నీళ్లు అందిస్తాం.. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీలిచ్చిన పాలకులు.. వట్టి నీళ్లు ఎట్ల తాగుతరు ప్రజలు అనుకున్నారేమో కానీ అందులో కలుపుకోవడానికి మందు కూడా సరఫరా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో గతంలో ఒక్కటే వైన్ షాప్ ఉండేది. కొత్తగా మరో షాప్ మంజూరైంది. దీంతో షాప్ ల యాజమాన్యాల మధ్య పోటీ తత్వం మొదలైంది.
తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వైన్ షాప్ నిర్వాహకులు ఇంటింటికీ తిరిగి కూరగాయల పంపిణీ చేసినట్టు వాహనాల ద్వారా మందు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆదివారం మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో బెల్ట్ షాప్ లకు తిరుగుతూ.. అయ్యా మందు కావాలా..? అమ్మా మందు కావాలా..? ఏం మందు కావాలి.. ఎంత కావాలి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన ప్రజలు ప్రభుత్వ పథకాలు అందించడంలో కేసీఆర్ ను మించిన సీఎం ఏ రాష్ట్రంలో లేడు.. ఇగ రాడు అని మాట్లాడుకుంటున్నారు.