వరంగల్ జిల్లా ఎందుకు ఫేమస్…? ఓరుగల్లు కోట, రుద్రమాదేవి చరిత్ర, లక్నవరం… ఇలాంటి జాబితాలో ఇప్పుడు మరో అంశం చేరేలా కనిపిస్తోంది. అదే లిక్కర్. అవును వరంగల్ మద్యం కిక్కుతో ఊగుతూ… ఖజనాకు కూడా కిక్కేక్కిస్తోందట. ఇవేవో గాలి లెక్కలు కాదు… స్వయంగా వరంగల్ జిల్లా ఎక్సైజ్ అధికారులు చెప్తోన్న అధికారిక లెక్కలు.
ప్రతి ఇంట్లో పాలు తప్పనిసరి. కొంచెం ఎక్కువో తక్కువో పాలు వాడుకోని ఇల్లు ఉండదనే చెప్పొచ్చు. అలా లెక్కేసిన వరంగల్ రూరల్ జిల్లాలో జనాభాను బట్టి సగటున లక్ష లీటర్ల పాలు అవసరమవుతాయి. ఆ లెక్కన 70రూపాయాలు లీటర్‌కు ఖర్చు చేసినా… 70లక్షలు ఒక్క రోజుకు ఖర్చవుతాయి. వరంగల్ ఎక్సైజ్ చెప్తోన్న లెక్కల ప్రకారం… ఒక రోజుకు సగటున మందుబాబులు చేస్తోన్న ఖర్చు దాదాపు 6-7కోట్లు. అంటే దాదాపు 10రేట్లు ఎక్కువగా జనం పాల కన్నా, మద్యం మీదే ఎక్కువ ఖర్చుపెడుతోంది అన్న మాట. గడిచిన రెండు సంవత్సరాలలో రోజుకు సగటున 2లక్షల లీటర్ల మద్యం అమ్ముడవుతోంది. అంటే… పాలకన్నా డబుల్ అన్నమాట. ఏ విధంగా చూసినా… వరంగల్ జిల్లాలో పాల అమ్మకాలతో పోలిస్తే మద్యం అమ్మకాలు డబుల్‌గా ఉన్నాయి. ఇక సమ్మక్క సారక్క జాతర సమయంలో అనధికారికంగా జరిగే అమ్మకాలపై అసలు లెక్కే ఉండదు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాను బట్టి చూస్తే… మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్పా తగ్గే అవకాశం ఏమాత్రం కనపడటం లేదు.
ఒక్క వరంగల్ జిల్లాలోనే కాదు… దాదాపు రాష్ట్రంలోని ప్రతిజిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా బెల్ట్‌షాపులను చూసిచూడనట్లు వదిలేస్తుండటం మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా ఉండటానికి కారణం అనే వాదన బలంగా వినిపిస్తోంది.