దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావుకి సీబీఐ కస్టడీ ముగిసింది. దాదాపు ఐదు రోజుల పాటు అభిషేక్ ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా అభిషేక్ కు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
అయితే ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అధికారులు ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా అభిషేక్ రావు నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయర్ తర్వాత హైదరాబాద్ కు చెందిన అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది.
అయితే అభిషేక్ బోయినపల్లిని ఎక్కడ అరెస్ట్ చేశారు. అనే విషయాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ 15 మందిని నిందితులుగా పేర్కొంటూ.. మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
అనంతరం పలు మార్లు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, ఈ కేసుకు సంబంధించిన పలువురు వ్యక్తులను ప్రశ్నించింది. మరికొందరిని ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పొలిటికల్ లీడర్స్, వారి అనుచరులు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.